Tuesday 12 November 2013

ఔరా...ఈ విన్యాసం..


తాళ్ల సహాయంతో గాలిలో ఎగురుతూ అమ్మాయిలు చేసే అబ్బుర విన్యాసాలు..గజరాజు,కోతిల ఆటలు, జోకర్ నవ్వులు,ఆశ్చర్యపరిచే ఫీట్లు,నిప్పుతో చెలగాటాలు,ఒళ్లు గగుర్పరిచే విన్యాసాలు.. ఇంకా ఎన్నో వింతలతో జమున సర్కస్ విజయవాడ నగర ప్రజలను ఆకట్టుకుంటుంది. మన చిన్నతనంలో సర్కస్ కి వెళ్లడమంటే పెద్ద పండుగే. నిప్పుల చట్రంలో నుంచి సింహం దూకుతుంటే భయంతో అమ్మ ఒళ్లొ తల పెట్టుకునేవాడిని. డాడి ముందు కుర్చిల్లో కూర్చుందామంటే..నేను మాత్రం గ్యాలరీ కావాలని గారాం చేసేవాన్ని. అక్కడైతే జంతువులకు దూరంగా వుండవచ్చని. ముక్కుకు ఎర్రటి కాయ పెట్టుకొని బఫూన్ చేసే అల్లరి నాకు ఎంతగానో నచ్చేది. మారుతున్న సాంకేతిక విజ్ఞానంతో ఎంతో ప్రగతి సాధించాం. అంతర్జాలం లో ప్రపంచం నలుమూలలు జరిగే వింతలు చిటికెలో ప్రత్యక్షమైతున్నాయి. కాని నేటికీ బొంబే సర్కస్, జెమిని సర్కస్, జమున సర్కస్, ఇంకా అనేక కంపెనీలు దేశం నలుమూలలా ప్రదర్శనలు ఇస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గతంలో ఉన్న ఆదరణ తగ్గినప్పటికీ సర్కస్ పేరు వినగానే చిన్నతనం గుర్తుల దొంతరలు అలా కదలాడుతునే ఉంటాయి. బెజవాడలో మళ్ళీ సర్కస్ రావడం ఎంతో ఆనందంగా ఉంది.

No comments:

Post a Comment